ఘనంగా సర్దార్ వల్లభాయి పటేల్ జయంతి వేడుకలు

భారతదేశ ఐక్యత మరియు సమగ్రతకు రూపశిల్పి సర్దార్ వల్లభాయ్ పటేల్‌కు పలువురు నివాళులు అర్పించారు. విశాఖ రూరల్‌ పోలీసు సూపరింటెండెంట్‌ బి కృష్ణారావు జాతీయ ఐక్యతా దినోత్సవ విశిష్టతను వివరించారు. ఈ సందర్భంగా ఆర్మ్‌డ్‌ రిజర్వ్‌ సిబ్బంది, అధికారులు ఐక్యతా ప్రతిజ్ఞ చేశారు. అనంతరం బీచ్ రోడ్డులో జాతీయ ఐక్యతా పరుగు నిర్వహించారు. నగర పోలీస్ కమిషనర్ మనీష్ కుమార్ సిన్హా, కృష్ణారావు పరుగును జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డీసీపీ ఐ గౌతమి సాలి,  ఏఎస్పీ బి లక్ష్మీనారాయణ, ఏఆర్డీఎస్పీ ఆర్పీఎల్ శాంతికుమార్ తదితరులు పాల్గొన్నారు.

వాల్తేరు డివిజన్‌లో జాతీయ ఐక్యతా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విచ్చేసిన రైల్వే సిబ్బందితో డివిజనల్ రైల్వే మేనేజర్ అనుప్ కుమార్ సత్పతి ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా డీఆర్‌ఎం మాట్లాడుతూ.. పటేల్ జాతీయ సమగ్రతపై దృఢ విశ్వాసం, జాతీయ సమైక్యతపై మొండి పట్టుదల ఉన్న డైనమిక్ నాయకుడన్నారు. ఏడీఆర్‌ఎం సుధీర్‌కుమార్‌ గుప్తా, డీపీఓ ఆర్‌ఎన్‌ఏ పరిదా తదితరులు పాల్గొన్నారు. RINLలో సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా రన్ ఫర్ యూనిటీ నిర్వహించారు. ముఖ్య అతిథిగా సిజిఎం (మెడికల్‌) కె హెచ్‌ ప్రకాష్‌ హాజరు కాగా దాదాపు 250 మంది రన్‌లో పాల్గొన్నారు.