వైఖరి మార్చుకున్న చంద్రబాబు – హర్షం వ్యక్తం చేస్తున్న కార్యకర్తలు.

ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అయిన చంద్రబాబు తన వైఖరి మార్చుకుంటున్నారా? ఇప్పటి వరకు చీకటి నిర్ణయాలు తీసుకున్నారన్న విమర్శలు ఉన్న ఆయన…

వచ్చే ఎన్నికల నాటికి ఎత్తుగడ మారుస్తారా ?

పార్టీ ఇన్‌ ఛార్జీలు, సీనియర్‌ నేతల అభిప్రాయాలు టీడీపీలో నామ మాత్రమే అన్న అపప్రదను చెరిపేసే ప్రయత్నం చేస్తారా ? 

ఆ క్రమంలో టీడీపీ బాస్ కొత్తగా తీసుకుంటున్న నిర్ణయాలేంటి ?

అసలు బాబు తొందరకు కారణాలేంటి ?

టీడీపీ అధినేత చంద్రబాబు ఎప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అంతు చిక్కదని గతంలో పార్టీ కార్యకర్తలు, నేతలు అంతర్గతంగా పలు పర్యాయములు చర్చించుకున్నారు.  అయితే తాజాగా ఇక చీకటి నిర్ణయాలు ఉండవని కొంతమంది సీనియర్లతో చెప్పారని చర్చ జరుగుతుందని పార్టీ శ్రేణుల నుంచి సమాచారం అందుతోంది.  మొన్న మొన్నటి వరకు ఏ విషయంలోనైనా ఆఖరి నిమిషం వరకు సస్పెన్స్‌ క్రియేట్‌ చేసేవారట.  ఎన్నికల్లో అభ్యర్థులకు కూడా అర్దరాత్రి బీ-ఫారాలు ఇచ్చే సాంప్రదాయం చంద్రబాబుకి ఉందని రాజకీయ విశ్లేషకులు అంటుంటారు. 

అయితే ఇప్పుడు చంద్రబాబుకు జ్ఞానోదయం అయిందని అంటున్నారు కొంతమంది నేతలు.  ఏ నిర్ణయమైనా తీసుకున్న వెంటనే బహిర్గతం చేస్తానని చెప్పారట.  36 గంటల దీక్షతో పార్టీలో చైతన్యం తీసుకొచ్చారు చంద్రబాబు

కాకపోతే ఇక్కడ ఆయన క్లియర్ గా కొన్ని కండిషన్లు పెట్టారు.   ఎక్కడా సమావేశాలు, సమీక్షలు ఉండవు. ఇన్ చార్జీలు, సీనియర్ నేతల అభిప్రాయాలతో సంబంధం లేకుండా అభ్యర్థుల పనితీరును నేరుగా చంద్రబాబే సమీక్షిస్తారట. ఆయన నిర్ణయమే ఫైనల్. అయితే ఆ నిర్ణయమేదో కాస్త తొందరగా తీసుకుంటారని సమాచారం.

ఇక వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఏ నియోజకవర్గంలో ఎవరు పోటీలో నిలుస్తారనే అంశంపై కనీసం 6 నెలల ముందే స్పష్టత ఇస్తానని ఆయన నేతలందరికీ హామీ ఇచ్చినట్లు సమాచారం. ఇప్పటి వరకు తీసుకున్న చీకటి నిర్ణయాలతో టీడీపీలో కొంత మంది కీలక నేతలు పార్టీ మారగా.. మరికొంతమంది అంటీ ముట్టకుండా ఉన్నారు.  ఇప్పటికే దెబ్బతిన్న టీడీపీ భవిష్యత్తులో అస్తిత్వం చాటాలంటే ఏవో కొన్ని నిర్ణయాలు తీసుకోవాలి.

గతంలో టీడీపీలో టికెట్ ఖరారు కావాలంటే ముందుగా స్క్రీనింగ్ కమిటీ వారిని ఫైనల్ చేయాలి. ఆ తర్వాత ఆ లిస్ట్ ని బాబు నాన్చీ, నాన్చీ.. చివరకు నామినేషన్ ముందురోజు పేరు ప్రకటించేవారు. కానీ ఈసారి స్క్రీనింగ్ కమిటీలకు కూడా చోటు లేదంటున్నారు. ఎవరైతే ప్రజల్లో బాగా తిరుగుతున్నారో, వారికి మైలేజీ ఉందని చంద్రబాబు భావిస్తారో.. అలాంటి వారికే టికెట్లు కేటాయించబోతున్నారట. ఎన్నికలకు కనీసం ఏడాది ముందే టిక్కెట్లు కేటాయించే అంశాన్ని పరిశీలిస్తున్నారు చంద్రబాబు.

చంద్రబాబు తాజా నిర్ణయం వెనక ప్రధాన వ్యూహం ఒకటేనంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఏడాది ముందు టికెట్లు కేటాయిస్తే.. అభ్యర్థులకు జనంలోకి వెళ్లేందుకు అవకాశం ఉండటంతో పాటు, అసంతృప్తులకు కళ్లెం వేసినట్టు అవుతుందట. ఒకవేళ అసంతృప్తులు అలిగినా.. అలాంటి వారికి ఇతర పార్టీల్లో ముఖ్యంగా వైసీపీలో చోటు ఉండదు. అసమ్మతి రేగినా ఫిరాయింపులు ఉండవు.

చంద్రబాబు సహజంగా ఎన్నికల ముందు ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకొనేందుకు  ఉత్సాహం చూపిస్తారు. పొత్తులపై నిర్ణయం ఆలస్యం అయ్యే కొద్దీ అభ్యర్థుల్లో గుబులు రేగడం కామన్. ఒకవేళ ఇప్పుడు ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో.. త్యాగరాజులు ఉంటే మాత్రం అది మరింత కష్టం. ఈ సమీకరణాలన్నీ బేరీజు వేసుకుని చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

అయితే సమీకరణాలు మారినా, అభ్యర్థుల పేర్లు మారినా.. ఈసారి మాత్రం అర్థరాత్రి, చీకటి నిర్ణయాలు మాత్రం ఉండబోవని చంద్రబాబు ఖరాఖండిగా తేల్చి చెప్తున్నారంట.  అయితే ఇప్పటి వరకు చెప్పిందొకటి చేసిందొకటి అన్నట్లు వ్యవహరించిన టీడీపీ బాస్…. ఈ విషయంలో ఇలానే ఉంటారా ? మళ్లీ చీకటి నిర్ణయాలకే తెరలేపుతారా అనేది వేచిచూడాలి మరి.