బద్వేల్ ఎన్నికపై పవన్ స్టాండ్ ఏమిటి ?

జనసేన వ్యవహారం ఆసక్తిగా మారింది. తాను యుద్ధానికి సిద్ధమయి వచ్చానని ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అనేకమార్లు  ప్రకటించారు. మీకు ఎలాంటి పద్ధతిలో యుద్దం కావాలో మీరే  నిర్ణయించుకోండి అంటూ పార్టీ కార్యకర్తల సమావేశంలో వ్యాఖ్యానించారు. కానీ ఆయన సుదీర్ఘ ఉపన్యాసం ఇచ్చారు తప్ప ముంగిట్లో ఉన్న బద్వేలు ఉప ఎన్నికల గురించి మాత్రం పల్లెత్తు మాట పలకలేదు. దాంతో బద్వేలులో జనసేన ఏం చేస్తుందన్నది ప్రశ్నార్థకంగా మారింది. స్వయంగా పోటీ చేస్తుందా ? లేక మళ్లీ బీజేపీ కే మద్దతిస్తుందా ?

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈసారి రాజీపడేందుకు సిద్ధంగా లేరు. బద్వేలు ఉప ఎన్నికలలో జనసేన నుంచి అభ్యర్థిని బరిలోకి దింపాలని నిర్ణయించారు. ఇప్పటికే బీజేపీతో పొత్తుతో జనసేన క్యాడర్ లో కొంత ఇబ్బంది ఎదురవుతుంది. తిరుపతి ఉప ఎన్నికల సమయంలోనూ జనసేన క్యాడర్ నుంచి వత్తిడి ఎదురయింది. అయినా తప్పనిసరి పరిస్థితుల్లో తిరుపతి ఉప ఎన్నికను బీజేపీకే వదిలేయాల్సి వచ్చింది. నిజానికి తిరుపతిలో జనసేన బలం ఎక్కువగా ఉంది. తిరుపతి, శ్రీకాళహస్తి వంటి నియోజకవర్గాల్లో బలిజ సామాజికవర్గం ఓట్లు ఎక్కువగా ఉండటంతో అప్పట్లో జనసేన నుంచి పోటీ చేయాలని పవన్ కల్యాణ‌్ కూడా భావించారు. తిరుపతి లో జరిగిన కార్యకర్తల సమావేశంలో క్యాడర్ కు కూడా హామీ ఇచ్చారు. కానీ పార్లమెంటు ఎన్నిక కావడంతో కేంద్ర నాయకత్వం జోక్యంతో దానిని బీజేపీకే వదిలేయాల్సి వచ్చింది.

ఇక ఇప్పుడు కూడా బద్వేలు ఉప ఎన్నికను బీజేపీకే వదిలేస్తే క్యాడర్ లో తప్పుడు సంకేతాలు వెళతాయని పవన్ కళ్యాణ్ గ్రహించాలి. ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్ పార్టీ పెద్దలకు వివరంగా చెప్పారని కూడా సమాచారం. బద్వేల్ లో మాత్రం జనసేన అభ్యర్ధి బరిలో ఉంటారనిం, ఈ విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని పవన కళ్యాణ్ చెప్పినట్లు తెలుస్తుంది.   

జనసేనాని ఈసారి స్వయంగా తన అభ్యర్ధిని రంగంలోకి దింపుతారా ? లేక మళ్లీ వత్తిడికి లోనై బీజేపీకి మద్దతు పలుకుతారా అన్నది మిలియన్‌ డాలర్ల ప్రశ్నగా మారింది. రాజీ పడే ప్రసక్తి లేదంటున్న పవన్ కల్యాణ్  అదే మాట మీద నిలబడి జనసేన అభ్యర్ధిని నిలబెడుతారా ? లేక బీజేపీకి మద్దతిచ్చి మరోసారి తన మిత్రదర్మాన్ని పరీక్షించుకుంటారా అన్నది చూడాలి మరి.