ఇప్పుడు ఆయనే కీలకం .. అవునన్నా .. కాదన్నా ..

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉంది. అయితే ఇప్పటి నుంచే రాష్ట్రంలో రాజకీయ హడావుడి మొదలైనట్లు కనిపిస్తుంది. ముఖ్యంగా కుల రాజకీయ సమీకరణలతో పొలిటికల్ హీట్ పెరిగిపోతోంది. సహేతుకమైన కారణంతో ఆన్‌లైన్ టికెట్లపై మాట్లాడిన జనసేన అధినేత పవన్ కళ్యాన్ ప్రస్తుతం హాట్ టాపిక్గా మారిపోయారు. కాపు సామాజికవర్గంలో చీలకకు అధికారపక్షం కుట్ర చేస్తోందన్న విమర్శలు వస్తున్నాయి.  మరిలాంటి తరుణంలో కూడా ప్రముఖ కాపునేత ముద్రగడ పద్మనాభం సైలెంట్‌గానే ఉంటున్నారు. దాంతో అందరలో ముద్రగడ స్పందన ఎలా ఉంటుందనే ఆసక్తి నెలకొంది.

ఈ మధ్యనే పవన్ కళ్యాణ్ ఏపీలో టూర్ చేసి రాజకీయాలలో కొత్త సమీకరణలకు తెర లేపారు. ఆయన రాబోయే రోజుల్లో చేయబోతున్న రాజకీయం ఎలా ఉంటుందో కూడా చెప్పేసారు. సినీ పరిభాషలో చెప్పుకోవాలి అంటే ఆయన ఒక ట్రైలర్ వదిలారు అన్న మాట.

సరే ఇంతకాలం ఎలా ఉన్నా ఇపుడు మాత్రం ఏపీలో పవన్ మాటలను సీరియస్ గానే కాపు నేతలు పట్టించుకుంటున్నారు అన్న సంకేతాలు అయితే వెలువడుతున్నాయి. కాపుల నేతగా ఉన్న మాజీ మంత్రి హరి రామ జోగయ్య వంటి వారు అయితే పవన్ కి ఈ విషయంలో దాదాపుగా రాజకీయ గురువుగా వ్యవహరిస్తున్నారు అనే చెప్పాలి.

సరే కాపులు ఏపీలో పెద్ద సంఖ్యలో ఉన్నారు. వారంతా కలిస్తే రాజకీయం మారుతుంది అన్నది ఎప్పటి నుంచో ఉన్న మాటే. వారు ఐక్యంగా ఈసారి అయినా ముందుకు వస్తారా అన్నది కూడా ఒక చర్చగా మారింది.

ఇవన్నీ పక్కన పెడితే కాపులకు నిఖార్సుగా సేవ చేసిన వారు ఎవరు కాపు జాతి కోసం ఉద్యమ బాట పట్టిన వారు ఎవరూ అంటే మాత్రం మొదటిగా చెప్పుకోవాల్సింది వంగవీటి మోహన రంగా గురించే. ఆయన కేవలం కాపుల కోసమే ఉద్యమించలేదు. ఆయన పేదల కోసం పనిచేశారు. ఆ విధంగా ఒక సారి కార్పోరేటర్ గా గెలిచారు. మరోసారికి బెజవాడ సెంట్రల్ ఎమ్మెల్యే అయ్యారు. ఇంకా ఎంతో భవిష్యత్తు ఉందనుకుంటున్న టైమ్ లో ఆయన దారుణంగా హత్యకు గురయ్యారు. దాంతో రాష్ట్రం అట్టుడికి పోయిందంటేనే రంగా ఛరిష్మా అర్ధమవుతుంది. ఆయన హత్య తరువాతనే  కాపులు బాగా చైతన్యమై మరింత సంఘటితం అయ్యారనే చెప్పుకోవాలి.

ఇక రంగా తరువాత కాపుల కోసం ఆ స్థాయిలో పోరాటం చేసింది మాత్రం ముద్రగడ పద్మనాభమే అని చెప్పాలి. ముద్రగడ పోరాటం కాపుల అస్తిత్వం గురించి మాత్రమే కాదు వారి జీవన ప్రమాణాలు మెరుగు కావాలని కూడా తపించారు. ఆయన రాజకీయ ఆర్ధిక సామాజిక అంశాల మీద ఉద్యమించారు. ముద్రగడ 1990 దశకం నుంచి పోరాడుతూనే ఉన్నారు. దాని కోసం ఆయన తన రాజకీయ జీవితాన్ని కూడా త్యాగం చేశారు. నిజానికి అందరిలాగానే ఉండి ఉంటే ఆయన కూడా ఈపాటికి ఉప ముఖ్యమంత్రి,  కేంద్ర మంత్రి స్థాయిలలో కూడా వెలిగేవారేమో. కానీ ఆయన కాపుల అభ్యున్నతినే తన అజెండాగా చేసుకున్నారు.

కాపులను బీసీలలో చేర్చాలని ఆయన అతి పెద్ద ఉద్యమం నడిపారు. ఆ సమయంలో ఆయనకు ఇపుడు పెద్ద మాటలు మాటలు మాట్లాడుతున్న వారి మద్దతు ఎంతవరకూ దక్కింది అన్నది ఆలోచించాల్సిన విషయమే.  ఇక కాపుల కోసం పనిచేసిన ముద్రగడకు ఏ రకమైన సినీ చరిష్మా లేదు. ఆయన కేవలం తమ చిత్తశుద్ధి నిజాయతీని నమ్ముకునే కులం కోసం గొంతెత్తారు. చివరికి కేవలం టీడీపీని ఓడించడానికే గత ప్రభుత్వ హయాంలో కాపు రిజర్వేషన్ల అంశాన్ని భుజానికెత్తుకున్నారన్న ఆరోపణలు కూడా లేకపోలేదు.

ఆ మేరకు వైసీపీతో లోపాయికారీ ఒప్పందం కూడా చేసుకున్నారన్న విమర్శలు వినిపించాయి. అనుకున్నది ఫలించాక ఇపుడు మౌన ముద్ర దాల్చారు. ఐతే వైసీపీ అధికారంలోకి వచ్చాక టీడీపీ ఇచ్చిన ఐదు శాతం రిజర్వేషన్లను కూడా తీసేయడం గమనార్హం. మరి కాపుల ఐక్యత గురించి మాట్లాడుతున్న ఈ టైమ్ లో ముద్రగడ ఎలా రియాక్ట్ అవుతారు అన్న చర్చ జరుగుతోంది. ముద్రగడ దాదాపుగా రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. అలాగే కాపు ఉద్యమానికి కూడా దూరంగా ఉంటున్నారు.

ముద్రగడ వంటి వారు కనుక ముందుకు వస్తే కాపులు నిజంగా ఏపీ రాజకీయాల్లో ఒక ఫోర్స్ గా ఉంటారని అంతా అంటున్నారు. ముద్రగడను తమ వైపు తిప్పుకోవాలని కూడా అనేక పార్టీలు ఇంతవరకూ ప్రయత్నించాయి. ఆయన ఎటూ టీడీపీకి మద్దతు ఇవ్వరని అంటారు. ఇక బీజేపీ, వైసీపీ వంటి పార్టీలు ఆయనతో అప్పట్లో చర్చలు జరిపాయని కూడా ప్రచారం అయితే సాగింది. మొత్తానికి వచ్చే ఎన్నికల్లో ఏపీ రాజకీయాల్లో కాపులు కీలక పాత్ర పోషిస్తారు అన్న అంశం అయితే గట్టిగా వినిపిస్తోంది. దీంతో అందరి చూపూ ముద్రగడ వైపు ఉంది. ఆయన వేసే  అడుగులు ఎటువైపు అనే చర్చ ఏపీ రాజకీయాల్లో జోరుగా నడుస్తోంది.