పథకం ప్రకారమే కుట్ర – సీఎం జగన్‌

మునుపు అధికారం దక్కలేదని, భవిష్యత్లో కూడా అధికారం ఇక రాదనే అక్కసుతోనే రాష్ట్రంలో కులాల మధ్య చిచ్చు పెడుతున్నారని సీఎం జగన్ ఆరోపించారు. రాష్ట్ర అభివృద్దిని అన్నిరకాలగా ఆటంకపరుస్తున్నారు. వాటిని అడ్డుకునేందుకు కోర్టుల్లో కేసులు పెడుతున్నారు. విజయవాడలో జరిగిన పోలీసుల అమరవీరుల సంస్మరణ దినోత్సవ సందర్భంగా జరిగిన సభలో ఆయన మాట్లాడారు. పోలీసుల సంక్షేమం కోసం అన్నీ రకాల ఆలోచనలు ప్రభుత్వం చేస్తుందని తెలిపారు. పోలీసులు తమ కుటుంబాలతో గడపాలని, వారికి విశ్రాంతి అవసరమని అన్నారు. దానిలో భాగంగానే వారికి వీక్లీ ఆఫ్ లను మొదటిసారిగా ప్రకటించిన ప్రభుత్వం మనదేని చెప్పారు. హోంగార్డులకు వేతనం పెంచామని, అలాగే కరోనాతో మృతి చెందిన పోలీసుల కుటుంబాలకు పరిహారం ఇస్తున్నామని అన్నారు.         

రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణ అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశమని, ఈ విషయమలో ఎవరికి మినహాయింపు లేదన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న ప్రస్తుత పరిణామాలపై సీఎం జగన్ స్పందించారు. విపక్షాలు పథకం ప్రకారమే కుట్రలకు ప్లాన్ చేస్తున్నారని.. అక్కసుతోనే ఇదంతా చేస్తున్నారనే ఆక్షేపించారు. ‘‘రాష్ట్రంలోని పిల్లలను డ్రగ్‌ అడిక్ట్స్‌గా ప్రపంచానికి చూపించే దుర్మార్గమైన ప్రయత్నం జరుగుతోంది. ఇది అత్యంత తీవ్రమైన నేరం.. అధర్మం. సాక్షాత్తు కేంద్ర ప్రభుత్వం, డీఆర్‌ఐ వివరణ ఇచ్చినా.. విజయవాడ సీపీతో పాటు డీజీపీ సైతం ఆ ఆరోపణలు అబద్ధాలు అని పదేపదే చెప్పినా లెక్కలేనితనం, అక్కసుతో వ్యవహరించారు. కులాలు, మతాల మధ్య చిచ్చు పెట్టేందుకూ వెనకాడట్లేదు. అధికారం దక్కలేదనే ఈ విధంగా చేస్తున్నారు. చీకట్లో ఆలయాలకు సంబంధించిన రథాలను తగలబెడుతున్నారు. ఆఖరికి సీఎంపైనా అసభ్య పదజాలం వాడుతున్నారు. ముఖ్యమంత్రిపై పరుష పదజాలం వాడటం సమంజసమేనా? సీఎంను అభిమానించేవాళ్లు తిరగబడాలి.. భావోద్వేగాలు పెరగాలని వాళ్లు ఆరాటపడుతున్నారు. వాళ్లు గెలవలేదని రాష్ట్రం పరువు తీసేందుకూ వెనుకాడట్లేదు. గిట్టనివాడు పరిపాలన చేస్తున్నారని ఓర్వలేకపోతున్నారు’’ అని జగన్‌ ధ్వజమెత్తారు.