•            భారతీయ నదుల పునరుజ్జీవనానికి పిలుపునిచ్చిన ఉపరాష్ట్రపతి

•            పాఠశాలల్లో జల సంరక్షణను పాఠ్యాంశంగా చేర్చాలి.

•            గౌహతిలో బ్రహ్మపుత్ర నది వారసత్వ సాంస్కృతిక కేంద్రాన్ని ప్రారంభించిన ఉపరాష్ట్రపతి

నదులను పరిరక్షించుకోవడం మనందరి సమష్టి బాధ్యత అని, మన నదులను పునరుజ్జీవింపచేయాల్సిన అవసరంపై శక్తివంతమైన జాతీయ ప్రచారానికి గౌరవ ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు.

ఢిల్లీ నుంచి ఈశాన్య భారతదేశ పర్యటనకు బయలుదేరి వెళ్ళిన ఉపరాష్ట్రపతి, గౌహతి చేరుకున్నారు. బ్రహ్మపుత్ర నది ఒడ్డున, వారసత్వ సాంస్కృతిక కేంద్రాన్ని ప్రారంభించారు. అక్కడి మ్యూజియంను కూడా సందర్శించిన ఆయన ఫరెవర్ గౌహతి అనే సచిత్ర పుస్తకాన్ని (కాఫీటేబుల్ బుక్) విడుదల చేశారు.

సనాతనకాలం నుంచి భారతీయులు నదులను గౌరవిస్తున్నారన్న ఉపరాష్ట్రపతి, పెరుగుతున్న పట్టణీకరణ మరియు పారిశ్రామికీకరణ కారణంగా దేశంలోని వివిధ నదులు, నీటివనరులు కలుషితం అవుతున్నాయని తెలిపారు. గతంలో గ్రామాలు, నగరాల్లో అనేక నీటి వనరులు ఉండే విషయాన్ని గుర్తు చేసిన ఆయన, ఆధునీకరణ అన్వేషణలో, అత్యాశ కారణంగా మనిషి సహజ పర్యావరణ వ్యవస్థలను నాశనం చేశాడని ఆవేదన వ్యక్తం చేశారు. నదుల ప్రాధాన్యత గురించి ముందు తరాలు తెలుసుకోవాలన్న ఆయన, జలసంరక్షణను పాఠ్యాంశంగా చేర్చాలని సూచించారు.

అనంతరం ఫేస్ బుక్ వేదిక ద్వారా తమ మనోగతాన్ని పంచుకున్న ఉపరాష్ట్రపతి, నదిని సందర్శించిన మరుపురాన్ని అనుభవాలను వివరించారు. బ్రహ్మపుత్ర సహజ నదీ సౌందర్యం తనను మంత్రముగ్ధుణ్ని చేసిందని, అద్భుతమైన నదీతీర ఉద్యానవనం సంతోషాన్ని, మరచిపోలేని జ్ఞాపకాలను పంచిందని తెలిపారు. లక్షలాది మందికి జీవనోపాధి అందించే ఈ నది ఈ ప్రాంత చరిత్ర, సంస్కృతుల్లో అంతర్భాగమని తెలిపారు