దైవ సన్నిధానంను సందర్శించిన స్వాత్మానందేంద్ర

హైదరాబాద్ లోగల విశాఖ శ్రీ శారదాపీఠ పాలిత ఆలయం ఫిలింనగర్ దైవ సన్నిధానాన్ని పీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతీ స్వామి సందర్శించారు. సోమవారం ఉదయం దైవ సన్నిధానం ప్రాంగణంలో ఉన్న దేవతామూర్తుల ఆలయాల్లో పూజలు చేసారు. ఆలయ సాంప్రదాయాలు, ఆగమ విధానాలపై అర్చకులు, పండితులతో చర్చించారు. ప్రత్యేక హోమాలు, పూజల ద్వారా భక్తులకు చేరువ కావాలని, దసరా నవరాత్రుల్లో, కార్తీక మాసంలో వైభవోపేతంగా చేపట్టాలని సూచించారు. విశిష్టమైన వైదిక కార్యక్రమాలను ఏటా చేపట్టేలా ప్రణాళిక రచించాలన్నారు. ఆలయాభివృద్ధికి అర్చకులంతా సమిష్టి కృషి చేయాలని సూచించారు. అనంతరం ఆలయ కమిటీ ఛైర్మన్, సినీ నటులు మోహన్ బాబు స్వామీజీతో భేటీ అయ్యారు. ఆలయాభివృద్ధికి చేపడుతున్న చర్యలపై స్వాత్మానందేంద్ర సరస్వతీ స్వామి చర్చించారు.