శాస్త్రవేత్తల చేతుల్లోనే దేశాభివృద్ధి- ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు

  • •            దేశాన్ని మరోసారి విశ్వగురు పీఠంపై నిలిపేందుకు పరిశోధకులు, శాస్త్రవేత్తలు కృషిచేయాలి
  • •            ఇంఫాల్‌ ఐబీఎస్‌డీలో ఫైటో ఫార్మాసుటికల్ ల్యాబ్‌ను ప్రారంభించిన ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్యనాయుడు
  • •            క్రీడాకారులు నవభారత స్ఫూర్తిని మరింత ముందుకు తీసుకెళ్తున్నారని ప్రశంస
  • •            మణిపూర్ ఒలింపియన్లతో ఉపరాష్ట్రపతి చర్చాగోష్టి

భారతదేశాభివృద్ధి సమర్థులైన, దేశభక్తులైన భారతీయ శాస్త్రవేత్తల చేతుల్లోనే  ఉందని భారత ఉపరాష్ట్రపతి శ్రీ  వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. భారతదేశాన్ని మళ్లీ విశ్వగురు పీఠంపై నిలపడంలో శాస్త్రవేత్తలు, పరిశోధకులు పోషించాల్సిన పాత్ర కీలకమని ఆయన అన్నారు.

మణిపూర్ రాజధాని ఇంఫాల్‌లోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ బయోడైవర్సిటీ అండ్ సస్టైనబుల్ డెవలప్‌మెంట్ (ఐబీఎస్‌డీ) ప్రాంగణంలో ఫైటో-ఫార్మాసూటికల్ ల్యాబ్ ఫెసిలిటీ కేంద్రాన్ని ఉపరాష్ట్రపతి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శాస్త్ర, సాంకేతికతమైన, విజ్ఞానపరమైన ఆలోచనా ధోరణిని మరింత విస్తృతంగా ముందుకు తీసుకెళ్లడమే దేశాభివృద్ధికి బాటలు వేస్తుందన్నారు. ‘సరైన విద్య, అవసరమైన నైపుణ్య శిక్షణ, క్రమశిక్షణకు ఆశావహ శాస్త్రీయ విజ్ఞానాన్ని జోడిస్తే సర్వతోముఖాభివృద్ధి సాధ్యమవుతుంది’ అని ఉపరాష్ట్రపతి అన్నారు.

ఈశాన్య భారతం జీవవైవిధ్య కేంద్రమని వివిధ జీవరాశులకు కేంద్రమన్న ఉపరాష్ట్రపతి.. అధునాతన బయోటెక్నాలాజికల్ టూల్స్ సాయంతో ఈశాన్యభారతంలో జీవవైవిద్యాన్ని కాపాడేందుకు ఐబీఎస్‌డీ చేస్తున్న కృషిని ప్రశంసించారు.

అనంతరం ఇంఫాల్ రాజ్‌భవన్‌లో జరిగిన కార్యక్రమంలో టోక్యో ఒలింపిక్స్‌లో మణిపూర్ నుంచి భారతదేశానికి ప్రాతినిధ్యం వహించిన క్రీడాకారులతో చర్చాగోష్టిలో పాల్గొన్నారు. భారత క్రీడారంగానికి మణిపూర్ పవర్ హౌజ్‌గా నిలుస్తోందన్నారు. మణిపూర్ వంటి చిన్న రాష్ట్రాలనుంచి వస్తున్న క్రీడాకారులే అంతర్జాతీయ క్రీడా యవనికపై భారతపతాకాన్ని రెపరెపలాడిస్తున్నారన్నారు. క్రీడల్లో దేశం గర్వపడేలా చేస్తున్న మణిపూర్ క్రీడాకారులను ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి అభినందించారు. ఆ తర్వాత మణిపూర్ సంస్కృతిని ప్రతిబింబించే కళాకారుల ప్రదర్శనను ఉపరాష్ట్రపతి తిలకించారు.