కార్యకర్తలకు అర్థం కాని ఆ ఎమ్మెల్యే …

చిత్తరు జిల్లా రాజకీయాల్లో కమ్మ, రెడ్డి సామాజిక వర్గాల మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతూ ఉంటుంది. ఇక్కడ కాపు నేతల హవా కొంత మేరకే ఉంటుందని చెప్పాలి. జిల్లాలో పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, చెవి రెడ్డి భాస్కర్ రెడ్డిలకు తిరుగులేదిప్పుడు. వారు ఏ కార్యం తలపెట్టినా దానికి ఎదురనదే ఉండదు. ఈ నేపధ్యంలో కాపు సామాజిక వర్గంకు చెందిన బలిజ ఎమ్మెల్యే మంత్రి కావడానికి గట్టిగా పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది.

ఎవరా నేత ?

ఏంటి ఆయన ఎత్తుగడ ?

అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నేటి వరకు ఆయన ప్రవర్తన కార్యకర్తలకు అస్సలు అర్థం కాని పరిస్థితి. అధికార పార్టీ ఎమ్మెల్యేగా పదవి చేపట్టి రెండున్నర సంవత్సరాలు గడుస్తున్నా చిత్తూరు ఎమ్మెల్యే జంగాలపల్లె శ్రీనివాసులు‌ వైఖరి ఎవరికీ అంతుపట్టడం లేదంట. ఆ క్రమంలో పార్టీలో వర్గ విబేధాలు తలెత్తుతున్నాయట. ఎమ్మెల్యే పోకడ గురించి నియోజకవర్గంలోనే కాదు. జిల్లా తీవ్ర చర్చనీయాంశంగా మరుతుంది. సొంత సామాజిక వర్గాన్ని తప్ప ఇతర వర్గాల పార్టి కేడర్ ను అసలు పట్టించుకోరన్న టాక్ పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. 2009లో ప్రజా రాజ్యం అభ్యర్ధిగా పోటీ చేసి ఓడిన ఆరణి శ్రీనివాసులు. 2014లో వైసీపి తరపున పోటీ చేసి సత్యప్రభ చేతిలో ఓటమిని చవి చూసారు. అయితే ఫ్యాన్ గాలితో 2019 ఎన్నికల్లో టిడిపి అభ్యర్ధి మనోహర్ పై గెలుపొందారు.

అధికారంలో లేని సమయంలో ఆరణి శ్రీనివాసులు వ్యవహార శైలి, ప్రస్తుతం ఆయన వ్యవహార శైలి తీరు పూర్తిగా భిన్నంగా ఉండడంతో పార్టి కేడర్ లో అసంతృప్తిని రాజేస్తోంది. సొంత సామాజిక వర్గానికి అధిక ప్రాధాన్యత ఇస్తూ ఇతర సామాజిక వర్గాలను పూర్తిగా దూరం‌ పెడుతున్నారన్న చర్చ పార్టీ చోటా నాయకుల్లో జరుగుతోంది. పార్టీ నాయకుల నుండి అధికారుల వరకూ అంతా తమ వారే ఉండాలనేది ఆయన పట్టుబట్టి మరి వారినే బదిలీ చేసుకోవడం అప్పట్లో తీవ్ర దుమారం రేపింది. దీంతో జిల్లా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా ఈ విషయంలో సీరియస్ అయినట్లు తెలిసింది.

చిత్తూరులోని కూరగాయల మార్కెట్ లో దుకాణాల కేటాయింపులో ఎమ్మెల్యే అనుచరులు డబ్బులు వసూలు చేయడం వివాదానికి దారి తీసింది. మార్కెట్ లోని దుకాణాల విషయంలో తమకు అన్యాయం జరిగిందని ఇతర సామాజిక వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ మంత్రి పెద్దిరెడ్డిని కలిసి తమ గోడును విన్నవించుకున్నారు. మంత్రే స్వయంగా ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసుల వ్యవహార శైలిపై వార్నింగ్ ఇచ్చినా ఆయన వ్యవహార శైలి మార్చుకోకుండా ఉన్నారనేది పార్టి నాయకుల వద్ద నుండి కార్యకర్తల వరకూ వినిపిస్తున్న విమర్శ. ఎన్నికల సమయంలో శ్రీనివాసులు ఇచ్చిన హామీల మేరకు ఒక్క సమస్య కూడా నేటికి పరిష్కరించక పోవడంతో ప్రజల్లోనే ఆయనపై తీవ్ర స్ధాయిలో వ్యతిరేకత మొదలవుతోంది. ప్రధానంగా చిత్తూరులో రోడ్డు విస్తరణ పనులు,త్రాగు నీటి సమస్య, పాత బస్టాండ్ వద్ద మున్సిపల్ దుకాణాల కాంప్లెక్స్ ఏర్పాటు, బస్టాండ్ వద్ద డార్మెంటరీల ఏర్పాటు వంటి పనుల ఏమాత్రం పట్టించుకోక పోవడంతో ప్రతిపక్షాలు ఆందోళన చేస్తున్నాయి. కానీ ప్రజల సమస్యల‌ కంటే తన సామాజిక వర్గం సంక్షేమానికే ఆయన ఎక్కువ మక్కువ చూపిస్తుండటాన్ని వ్యతిరేకిస్తున్నారు. దీంతో పార్టి కేడర్ కూడా అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది.

మున్సిపాలిటీలో కాంట్రాక్ట్ లు వద్ద నుండి మైనింగ్ లో ఎమ్మెల్యే అనుచరులు చెప్పిందే జరుగుతోంది. దీంతో పార్టి‌ నాయకులు కూడా ఏమి చేయలేక నిమ్మకుండి‌ పోయారు. ఇదే విషయంను మంత్రితో పార్టీ నాయకులు చర్చించినట్లు వినికిడి. ఎమ్మెల్యే వ్యవహార శైలితో  పార్టిలోని ద్వితీయ,తృతీయ శ్రేణుల నాయకులు పార్టి కార్యక్రమాలకు సైతంగా దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది. సొంత పార్టీ నాయకుడు,ప్రస్తుతం చిత్తూరు కార్పోరేషన్ డెప్యూటీ మేయర్ చంద్రశేఖర్ తో ఎమ్మెల్యే విభేధాలు తారా స్ధాయికి చేరుకున్నాయి. చంద్రశేఖర్‌ వార్డులో ఏ సమస్య తలెత్తినా అవి పరిష్కారనికి నోచుకోక పోవడంపై ప్రజలు మండిపడుతున్నారు. నాయకుల మధ్య వివాదాలు తమకు ఏం సంబంధం అని తమ సమస్యలు తీర్చేందుకే నాయకులు ఉన్నారని ప్రజలు మండిపడుతున్నారు.

ఇది ఇలా ఉండగా ఆరణి శ్రీనివాసులు మంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్నట్లు తెలుస్తొంది. ఇందుకోసం‌ నియోజకవర్గం పనులు అంతా ప్రక్కన‌ పెట్టి అమరావతిలో పార్టి పెద్దలను ప్రసన్నం చేసుకునేందుకు వెళ్ళి మంత్రి పదవిపై చర్చించినట్లు పార్టీ కేడర్ లో చర్చ జరుగుతుంది. జిల్లాలో వైసీపిలో బలమైన నాయకుడిగా ఉన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆశీస్సులు ఉంటేనే శ్రీనివాసులుకి పదవి దక్కుతుంది. రాయలసీమలో బలిజ సామాజిక వర్గంకు చేందిన ఆరణి శ్రీనివాసులు ఒక్కడే కావడంతో, పార్టి అధిష్టానం ఆయన పేరు పరిశీలించే అవకాశం ఉందంటున్నారు. అయితే మంత్రి పదవి ఆరణిని వరిస్తుందా లేదా అనే‌ విషయం వేచిచూడాలి.