Home PoliticsGuru TS Politics గులాబీ బాస్ పై విరుచుకుపడ్డ కొండా

గులాబీ బాస్ పై విరుచుకుపడ్డ కొండా

హుజురాబాద్ బైపోల్స్‌లో ఈటల రాజేందర్‌కి పెద్ద సపోర్ట్ దొరికింది. రంగారెడ్డి జిల్లాకు ఆ పేరు రావడానికి కారణమైన కొండా రంగారెడ్డి మనమడు కొండా విశ్వేశ్వరరెడ్డి ఈటలకి సపోర్ట్‌గా రంగంలోకి దిగారు. ఈటల తరహాలోనే కేసీఆర్‌ది అంతా నయవంచన అంటున్న మాజీ ఎంపీ విశ్వేశ్వరరెడ్డి ఘాటైన పదజాలంతో గులాబీబాస్‌పై విరుచుకుపడుతున్నారు. కేసీఆర్ సర్కార్‌ను ఎప్పటికప్పుడు సున్నితంగా అర్థమయ్యే రీతిలో వివరించి చెప్పే మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఈటలకు మద్దతుగా నేరుగా క్షేత్రస్థాయిలో సాయమందించేందుకు నియోజకవర్గంలోనే అడుగుపెట్టారు. కేసీఆర్‌తో తన ప్రయాణం, ఆయన చేసిన మోసాలను తెలియజేస్తూ హుజూరాబాద్ ప్రజలకు ఆయన రాసిన లేఖ రాజకీయవర్గాల్లో చర్చనీయాశంగా మారింది. మాజీ ఎంపి  కొండా విశ్వేశ్వర రెడ్డి రాసిన లేఖ ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్ లో  హాట్ టాపిక్‌గా మారింది.

హుజూరాబాద్ ఉప ఎన్నిక హీట్ రోజురోజుకీ పెరిగిపోతోంది. అధికార, విపక్ష నేతలు పోటాపోటీగా ప్రచారంలో దూసుకుపోతున్నారు. మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ను ఎలాగైనా ఓడించాలని అధికార టీఆర్‌ఎస్ ఇప్పటికే వివిధ పథకాల పేరుతో వేల కోట్ల నిధులను కుమ్మరించింది. మంత్రులు నియోజకవర్గంలోనే తిష్టవేసి గ్రామాలను యూనిట్‌గా తీసుకుని ఒక్క ఓటు వదలకుండా పర్యవేక్షిస్తున్నారు. బీజేపీ అభ్యర్థిగా బరిలో ఉన్న ఈటల రాజేందర్ అదేస్థాయిలో నియోజకవర్గాన్ని చుట్టేస్తున్నారు. కేసీఆర్ అహంకారానికి, హుజూరాబాద్ ప్రజల ఆత్మగౌరవానికి పోటీగా అభివర్ణిస్తున్నారు.

తాజాగా ఈటల రాజేందర్‌కి సపోర్ట్‌గా రంగంలోకి దిగారు మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి. కేసీఆర్ సర్కార్‌వి నిరంకుశ చర్యలంటున్న ఆయన నేరుగా క్షేత్రస్థాయిలో సాయమందించేందుకు హుజురాబాద్ నియోజకవర్గంలోనే అడుగుపెట్టారు. ఆయన టీం నియోజకవర్గంలోని ఇంటింటికీ తిరిగి కరపత్రాలను పంపిణీ చేస్తోంది. ఆయన లేఖపై ప్రస్తుతం హుజురాబాద్‌లో పెద్ద డిబేటే నడుస్తోంది.

ముఖ్యమంత్రి కేసీఆర్‌ను నమ్మి ఆయన వెంట నడిస్తే తమను దారుణంగా మోసం చేశారని విశ్వేశ్వర్ రెడ్డి విమర్శించారు.. ఉమ్మడి రాష్ట్రంలో అన్యాయం జరుగుతోందని కొట్లాడి తెలంగాణ తెచ్చుకుంటే, ఇప్పుడు సొంత వాడి చేతిలోనే మోసపోవాల్సి వచ్చిందని ఆయన ఘాటు విమర్శలు చేశారు. ప్రాణహిత చేవెళ్లను తమకు కాకుండా చేసి.. కృష్ణా నది నుంచి ఇస్తానని చెప్పారని గుర్తు చేశారు.

తెలంగాణ ఉద్యమానికి మూలస్తంభాలుగా ఉంది మీరేనని హుజురాబాద్ ఓటర్లను ఉద్దేశించి పేర్కొన్నారు. హుజూరాబాద్ ఓటరుగా మీకు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాలను మలుపు తిప్పే అవకాశం వచ్చిందని, ఈ ఉప ఎన్నికలో మీరు ఇచ్చే తీర్పు రేపటి తెలంగాణకు ఆశాకిరణం అవుతుందని తాను నమ్ముతున్నానని విశ్వేశ్వరరెడ్డి పేర్కొన్నారు. ఇప్పుడు రాష్ట్రమంతా మీ దిక్కు చూస్తోందని  ప్రచారం చేస్తున్నారు. మరి ఈ మాజీ ఎంపీ మద్దతు ఈటలకు ఎంతవరకు కలిసివస్తుందో చూడాలి.

Exit mobile version