విశాఖ శారదాపీఠంలో 7వ తేదీ నుంచి దసరా వేడుకలు

రోజుకో అవతారంలో రాజశ్యామల అలంకరణ

ఉత్సవాల్లో అమ్మవారి నిజరూపాన్ని వీక్షించే అవకాశం

దసరా శరన్నవరాత్రి మహోత్సవాలకు విశాఖ శ్రీ శారదాపీఠం ముస్తాబైంది. పీఠాధిపతులు స్వరూపానందేంద్ర సరస్వతీ మహాస్వామి పర్యవేక్షణలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఉత్సవాల్లో పీఠం ఆధిష్ఠాన దేవత శ్రీ శారదా స్వరూప రాజశ్యామల అమ్మవారు రోజుకో అవతారంలో విశేష అలంకరణతో దర్శనమిస్తుంది. 7వ తేదీన ప్రారంభమయ్యే శరన్నవరాత్రి మహోత్సవాలు 15వ తేదీ వరకు కొనసాగుతాయి. పీఠాధిపతుల చేతుల మీదుగా సాగే అభిషేక సేవలో శ్రీ శారదా స్వరూప రాజశ్యామల అమ్మవారి నిజరూప దర్శనం ఉంటుంది. ఈ ఉత్సవాల సమయంలో మాత్రమే అమ్మవారి దివ్యమంగళ రూపాన్ని దర్శించే అవకాశం ఉంటుంది. సకల జనావళికి భోగ భాగ్యాలు సిద్ధించాలని, లోక కళ్యాణం జరగాలని సంకల్పిస్తూ విశాఖ శ్రీ శారదాపీఠం శ్రీమత్ దేవీ భాగవత పారాయణం చేపడుతోంది. నవరాత్రుల సమయంలో ఈ పారాయణ వింటే పుణ్యఫలం దక్కుతుందని భక్తుల విశ్వాసం. ఈ ఉత్సవాలలో భాగంగా శ్రీ చక్రానికి నవావరణ అర్చన నిర్వహిస్తారు. ఈ అర్చన నిర్విరామంగా ఐదు గంటల పాటు సాగుతుంది. శంకరాచార్య సాంప్రదాయ పీఠాల్లో మాత్రమే నిర్వహించే నవావరణ అర్చనకు విశేష ప్రాధాన్యత ఉంది. నవరాత్రి వేడుకల్లో రాజశ్యామల అమ్మవారు బాలాత్రిపుర సుందరి, మహేశ్వరి, వైష్ణవి, అన్నపూర్ణ, లలితాత్రిపుర సుందరి, మహా సరస్వతి, మహాలక్ష్మి, మహిషాసుర మర్దని, విజయ దుర్గ అవతారాల్లో భక్తులను అనుగ్రహిస్తారని విశాఖ శ్రీ శారదాపీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతీ స్వామి తెలిపారు. ప్రతిరోజు అమ్మవారిని స్తుతిస్తూ సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేసినట్లు వివరించారు.