చంద్రబాబు పైత్యం పరాకాష్టకు చేరింది: సజ్జల

చంద్రబాబు పైత్యం పరాకాష్టకు చేరిందని వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మంగళవారం ఆయన తాడేపల్లిలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ ప్రతి పక్షాలు ఏక్కడ ఏది జరిగినా ప్రభుత్వంపై కావాలనే విషప్రచారాలు చేస్తున్నాయని ఆరోపించారు. హెరాయిన్‌, డ్రగ్స్‌లకు ఏపీ అడ్డగా మారిందని విపక్షాలు నిరాధార ఆరోపణలు చేస్తున్నాయని సజ్జల మండిపడ్డారు. చంద్రబాబు దిగజారీ రాజకీయాలు చేస్తున్నారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తమకు అనుకూల మీడియాల్లో అడ్డమైన కథనాలు రాయించుకుంటున్నారని సజ్జల విమర్శించారు. హెరాయిన్‌ కేసును కేంద్ర నిఘా సంస్థలు దర్యాప్తు చేస్తున్నాయని సజ్జల తెలిపారు. టీడీపీ వాళ్లు డ్రగ్స్‌ వ్యాపారంలోకి దిగారేమోనన్న అనుమానం ఉందని విమర్శించారు. దొంగే దొంగ.. దొంగ అన్నట్లుగా టీడీపీ తీరు ఉందని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. రూ.వేల కోట్ల డ్రగ్స్‌ కేసులో ఎవరు ఉన్నారో దర్యాప్తులో తేలుతుందని అన్నారు. టీడీపీ హయాంలో గంజాయి రవాణాను చూసీ చూడనట్లు వదిలేశారని అన్నారు. దీనిపై సీఎం జగన్‌ ఉక్కుపాదం మోపాలని ఆదేశాలు ఇచ్చినందువల్లే గంజాయి రవాణాపై అధికారులు విస్తృత దాడులు చేస్తున్నారని అన్నారు. ప్రజలు ఎన్నిసార్లు తిరస్కరించినా చంద్రబాబుకు సిగ్గులేదని సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు.