గులాబ్ తుఫాన్ పై చంద్రబాబు పత్రికా ప్రకటన

గులాబ్ తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో బాధితులకు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అండగా నిలవాలని కోరారు టీడీపీ జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి, శాసనసభ ప్రధాన ప్రతిపక్ష నేత, శ్రీ నారా చంద్రబాబు నాయుడు. రాష్ట్రంలో గులాబ్ తుఫాన్ ప్రభావంపై  ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టి నష్టాన్ని నివారించాలని కోరుతూ ఆయన ప్రకటన విడుదల చేశారు. తుఫాన్ ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కూరుస్తున్నాయని, ఫలితంగా పలు ప్రాంతాలు జలమయం అయ్యాయిని తెలిపారు. వేలాది మంది నిరాశ్రయులు అయ్యారు. బలమైన గాలులు వల్ల తీవ్ర పంట నష్టం వాటిల్లింది. ప్రభుత్వం తక్షణమే స్పందించి ప్రజలను అదుకోవాలని ఆయన ఆ ప్రకటనలో కోరారు.         

తుఫాను ప్రభావంతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు తెలుగుదేశం పార్టీ నాయకులు, శ్రేణులు, కార్యకర్తలు తమ వంతు సాయం అందజేయాలన్నారు. ప్రజలకు అవసరమైన నిత్యావసర సరకులతో పాటు లోతట్టు ప్రాంతాల్లో ఉన్న వారిని సురక్షిత ప్రదేశాలకు తరలించడంలో సహాయం అందించాలి. వారికి అన్ని విధాల అండగా నిలవాలని ఆయన కోరారు. గులాబ్ తుఫాను ప్రభావంపై ప్రభుత్వం ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నంలో లోతట్టు ప్రాంతాల ప్రజలకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలి. విద్యుత్ సరఫరాకు ఆటంకం కలుగకుండా అప్రమత్తంగా ఉండాలి. ముందస్తు చర్యలు చేపట్టి నష్టాన్ని నివారించాలని ఆయన విడుదల చేసిన పత్రికా ప్రకటనలో తెలిపారు.