– విశాఖ శారదాపీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర
– పల్నాడులో హిందూ ధర్మ ప్రచార యాత్ర
– కోటప్పకొండ శివాలయాన్ని సందర్శించిన స్వామిజీ

హిందుత్వం మతం కాదని, అది భారతీయ జీవన విధానమని అన్నారు విశాఖ శారదాపీఠం ఉత్తరాధికారి స్వామి స్వాత్మానందేంద్ర సరస్వతి. ఇంకా చెప్పాలంటే హిందూత్వం మానవ ధర్మమని విశ్లేషించారు. సకల మానవాళిని సుఖంగా ఉంచడమే హిందూ ధర్మం యొక్క శాశ్వత సూత్రమన్నారు. హిందూ ధర్మం ఏ ఒక్క ప్రవక్త వలనో ఆవిర్భవించింది కాదని, యుగయుగాల సాధనతో ఏర్పడిన మహా ధర్మమని విశ్లేషించారు. వేదాలు, ఉపనిషత్తుల, పురాణ గాథలు, ఇతిహాసాల నుంచి ఒక జీవన విధానంగా హిందూ ధర్మం ఆవిర్భవించిందని చెప్పారు. గుంటూరు జిల్లాలో ప్రారంభమైన హిందూ ధర్మ ప్రచార యాత్ర గురువారం పల్నాడు ప్రాంతంలో సాగింది. నరసరావుపేట, మాచర్ల, గురజాల, పిడుగురాళ్ళ ప్రాంతాల్లో స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామి యాత్ర నిర్వహించారు. ఉదయం కోటప్పకొండలో త్రికోటేశ్వర స్వామి ఆలయ సందర్శనతో యాత్ర ప్రారంభించారు. శివాలయ సందర్శనకు వచ్చిన స్వామిజీకి కోటప్పకొండ దేవస్థానం అధికారులు ఆలయ మర్యాదలు చేశారు. మేళ తాళాల మధ్య పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. స్వామి స్వాత్మానందేంద్ర విశాఖ శారదాపీఠం తరపున త్రికోటేశ్వరునికి పట్టువస్త్రాలు సమర్పించారు. ఆ తర్వాత కోటప్పకొండలోని శ్రీ వేంకటేశ్వర వేద పాఠశాలకు స్వామీజీ వెళ్ళారు. వేద విద్యార్థులతో కొద్దిసేపు ముచ్చటించారు. వేద విద్యాభ్యాసం సాగుతున్న తీరును పాఠశాల నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులంతా స్వామీజీకి మర్యాద పూర్వకంగా వేదాలను వల్లె వేశారు. పల్నాడు ప్రాంతంలో స్వామిజీ యాత్రకు విశేష స్పందన కనిపించింది. ఎక్కడికక్కడ హిందూ ధర్మాన్ని ప్రబోధిస్తూనే, పుణ్యక్షేత్రాల యొక్క విశిష్టతను తెలుసుకునే ప్రయత్నం చేశారు. నరసరావుపేట, మాచర్ల ప్రాంతాల్లో స్థానిక ఎమ్మెల్యేలు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కోరిక మేరకు వారి నివాసాలకు వెళ్ళారు. ఎమ్మెల్యేల కుటుంబ సభ్యులు, స్థానికులకు ఆశీస్సులు అందించారు. పిడుగురాళ్లలో సూర్య సెమ్ కంపెనీ యాజమాన్యం నిర్వహణలో ఉన్న నూకాంబిక బధిరుల పాఠశాలను విజిట్ చేశారు. బధిరులతో మాట్లాడి యోగక్షేమాలను అడిగి తెలుసుకుని ఆశీస్సులు అందించారు. స్వామిజీ వెంట ఈ యాత్రలో గుంటూరు సిమ్స్ విద్యాసంస్థల అధినేత భీమనాదం భరత్ రెడ్డి ఉన్నారు

పిడుగురాళ్లలో పీఠ పూజ
పిడుగురాళ్లలో యక్కల మోహనరావు నివాసంలో రాజశ్యామల స్వరూప శారద, చంద్రమౌళీశ్వరులకు పీఠపూజ నిర్వహించారు. సాల గ్రామాలకు, ఆది శంకరాచార్యుల పంచలోహ విగ్రహాలకు సుగంధ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించారు. ఈ పూజా ప్రక్రియ కనులవిందుగా సాగింది. దేవతా మూర్తులకు నవ హారతులిచ్చిన తీరు రమణీయంగా ఉంది. పీఠపూజ కోసం అలంకరించిన వేదిక అందరినీ ఆకట్టుకుంది. అనంతరం స్వామీజీ స్వహస్తాలతో భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేశారు. పీఠపూజను తిలకించేందుకు పిడుగురాళ్ళ పరిసర గ్రామాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు

Previous articleప్రయాణికులకు 2020 గిఫ్ట్…
Next articleభారీగా పెరిగిన బంగారం ధర

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here