రాజధాని విషయంలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయంతో ప్రతిపక్ష నేత చంద్రబాబుకు రాజకీయంగా ఉక్కిరి బిక్కిరి అయ్యే పరిస్దితి తలెత్తింది. అధికారం వికేంద్రీకరణ చెయ్యాలని జగన్మోహన్రెడ్డి తీసుకున్న నిర్ణయం అటు టీడీపీ పార్టీలో ప్రకంపనలు సృష్టించడమే కాకుండా త్వరలో జరగబోయే స్థానిక సంస్ధల ఎన్నికల్లో సైతం ఆ పార్టీకి తీవ్రనష్టం వాటిల్లే అవకాశాలు లేకపోలేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే ఈ అంశంలో టీడీపీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. చంద్రబాబు క్యాబినెట్ లో పనిచేసిన మాజీ ఉప ముఖ్యమంత్రి కేఈకృష్ణమూర్తి, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు లు జగన్ నిర్ణయాన్ని స్వాగతించడం చంద్రబాబు గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్లు అయ్యింది. కేఈ, గంటా దారిలోనే రాయలసీమ, ఉత్తరాంధ్ర కు చెందిన మెజారిటీ టీడీపీ నాయకులు జగన్ తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా మాట్లాడటానికి సిద్దంగా లేరు. ఈ పరిణామం చంద్రబాబును తీవ్ర అసహనానికి గురిచేస్తోంది. స్థానిక ప్రజల ఆకాంక్షలకు వ్యతిరేకంగా ఆయా ప్రాంతాల టీడీపీ నాయకులు రాజధాని విషయంలో చంద్రబాబు తీసుకున్న స్టాండు కు వ్యతిరేకంగా ప్రవర్తించాల్సిన తప్పనిసరి పరిస్థితులు ఏర్పడ్డాయి.

జగన్ వెల్లడించింది అభిప్రాయమే…
వాస్తవానికి రాష్ట్రానికి మూడు రాజధానులు ఉంటే బాగుంటుందని తన అభిప్రాయాన్ని మాత్రమే అసెంబ్లీలో వెల్లడించారు… రాజధాని విషయంలో నియమించిన అధ్యయన కమిటీ తన నివేదిక సమర్పించిన తరువాత అందరితో చర్చించి నిర్ణయం తీసుకుంటామని వ్యూహాత్మకంగా వ్యవహరించారు. కానీ జగన్ నిర్ణయంతో ఖంగుతిన్న చంద్రబాబు ఒక్కసారిగా ఉలిక్కిపడి తనకు అనుకూలురైన రాజధాని రైతులను రోడ్లు ఎక్కించి నిరసనలు ప్రారంభించేసారు.

రాజధాని అంశంలో కేవలం ఒక ఫీలర్ వదిలి… ప్రతిపక్ష వేస్తున్న కుప్పిగంతులను మౌనంగా వీక్షిస్తున్నారు సీయం జగన్మోహనరెడ్డి. మూడు రాజధానులు ఏర్పాటు చేసి అధికార వికేంద్రీకరణ చేస్తే ఎలా ఉంటుందనే చర్చను లేవనెత్తడం ద్వారా ప్రతిపక్ష టీడీపీని ఇరకాటంలో పడేసారు జగన్.
అయితే ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లుగా అమరావతి రాజధానిగా ఏర్పాటు చేసిన క్రమంలో టీడీపీ నాయకులు చేసిన ఇన్ సైడ్ ట్రేడింగ్ ను బట్టబయలు చేయడమే కాకుండా స్థానిక సంస్ధల ఎన్నికల్లో విజయదుంధుభి మోగించడానికి మార్గం సుగమం చేసుకున్నారు జగన్మోహనరెడ్డి.

– Adidam Ravi

Previous articleపర్వేజ్‌ ముషారఫ్‌కు ఎదురుదెబ్బ
Next articleకన్నా మౌన దీక్ష ..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here