ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఇరుకున పెట్టేందుకుగాను తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కొత్త అస్త్రాన్ని సంధించాలని నిర్ణయించుకున్నట్లు వినవస్తోంది.  సీఎం జగన్ తీసుకొచ్చిన ‘తప్పనిసరి ఇంగ్లీష్ మీడియం’పై టీడీపీ పోరాడుతోంది. అయితే మొదట ఇంగ్లీష్ మీడియంను తప్పుబట్టిన టీడీపీ ఆ తర్వాత కొంచెం మెత్తబడింది. తాము ఇంగ్లీష్ మీడియంకు వ్యతిరేకం కాదని, తెలుగును కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత ఉందని చెబుతోంది. ఈ క్రమంలో చంద్రబాబు యూ టర్న్ తీసుకున్నారంటూ ప్రభుత్వం ఎదురుదాడి చేస్తోంది. అయితే, దీనికి కౌంటర్‌ ఇవ్వాలని చంద్రబాబు భావిస్తున్నారు. ఇంగ్లీష్ మీడియం వివాదం విషయంలో జగన్ మీద బాలయ్యను సంధించాలని చంద్రబాబు ప్లాన్ చేసినట్టు టీడీపీలో చర్చ జరుగుతోంది. డిసెంబర్‌లో ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు జరగనున్నాయి. ఈ సందర్భంగా ఇంగ్లీష్ మీడియం అంశాన్ని లేవనెత్తి… దానిపై హిందూపురం ఎమ్మెల్యే బాలయ్యతో ప్రభుత్వం మీద విమర్శలు చేయించాలని టీడీపీ వ్యూహం పన్నినట్టు సమాచారం. బాలయ్య అయితేనే అందుకు సరిపోతాడని చంద్రబాబు భావిస్తున్నట్లు సమాచారం. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన సందర్భంగా పార్లమెంటులో అప్పటి రాజ్యసభ టీడీపీ ఎంపీ హరికృష్ణ అచ్చతెలుగులో మాట్లాడారు. తెలుగువారి ఔన్నత్యాన్ని, తెలుగు భాష గౌరవాన్ని ఆయన చాటిచెప్పారని అప్పట్లో అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఇప్పుడు ఏపీ అసెంబ్లీలో బాలయ్యతో అదే సీన్ రిపీట్ చేయించేందుకు టీడీపీ కసరత్తు చేస్తున్నట్టు పార్టీ వర్గాల్లో వినవస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here