అన్నిరంగాల్లో సమాన పాత్ర పోషించే మహిళలు రాజకీయాల్లో మాత్రం ఎక్కువగా కనిపించడం లేదు. స్త్రీలకు సమన్యాయం కల్పించాల్సిన పొలిటికల్ పార్టీలు అసలు కొన్ని సీట్లు ఇవ్వడానికి కూడా ఆలోచిస్తున్నాయి. వాగ్థానాలన్నీ మాటలకే పరిమితం చేసి పరిపాలనకు పనికిరారంటూ పక్కన పెట్టేస్తున్నారు.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మహిళలకు అన్ని రాజకీయ పార్టీలు తగిన ప్రాధాన్యత ఇవ్వలేదా … అంటే అవుననే సమాధానం వస్తోంది. మహిళా సాధికారత గురించి గొప్పలు చెప్పే రాజకీయ పార్టీలు ఎన్నికలు వచ్చేసరికి రూటు మార్చాయి. ఆకాశంలో సగం అవకాశాల్లో సగం అంటూ ఊకదంపుడు ఉపన్యాసాలిచ్చే పొలిటికల్ పార్టీలు … ప్రస్తుతం జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో మహిళలకు  కేవలం 40 సీట్లు మాత్రమే ఇచ్చి చేతులు దులిపేసుకున్నాయి.

రాష్ట్రంలో 119 అసెంబ్లీ నియోజకవర్గాలుంటే అందులో మహిళలకు కేటాయించిన స్థానాలు కేవలం 40 మాత్రమే. ఇక అధికార టీఆర్‌ఎస్‌ మొత్తం స్థానాల్లో పోటీ చేస్తూ.. నాలుగంటే నాలుగు స్థానాల్లోనే స్త్రీలకు అవకాశం ఇచ్చారు. మిగతా పార్టీల్లోనూ ఇలాంటి పరిస్థితే ఉంది. మహిళా సాధికారత గురించి పదే పదే గొప్పలు చెప్పే పార్టీలు.. ఎన్నికలు వచ్చేసరికి చూపించిన చిత్తశుద్ధి ఇదే.

స్థానిక సంస్థల ఎన్నికల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు అమలవుతున్న సంగతి తెలిసిందే. అయితే శాసనసభ, పార్లమెంటులో మాత్రం భూతద్దం వేసి వెతికినా ఈ రిజర్వేషన్ల అమలు ఎక్కడా కనిపించదు.   మగవారి కన్నా స్త్రీల సంఖ్య ఎక్కువగా ఉన్న నియోజకవర్గాల్లో సైతం.. మహిళలకు అవకాశాలు దక్కడం లేదు.రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన మహిళలకే కాస్తో కూస్తో ప్రాధాన్యం దక్కుతోంది.

తాజా ఓటర్ల సవరణ జాబితా ప్రకారం రాష్ట్రంలోని 55 నియోజకవర్గాల్లో మహిళా ఓటర్లే ఎక్కువగా ఉన్నారు.  పురుషుల కన్నా మహిళా ఓట్లు 5 శాతానికి మించి అధికంగా ఉన్న నియోజకవర్గాలు వీటిలో 14 ఉన్నాయి. నాలుగు స్థానాల్లో అయితే ఏకంగా 10 శాతానికి మించి అధికంగా మహిళా ఓటర్లు ఉన్నారు.

అన్నిరంగాల్లో సమాన పాత్ర పోషించే మహిళలకు ఎన్నికల్లో అవకాశం ఇవ్వకపోవడం పై మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత జరుగుతున్న తొలి ఎన్నికలైనా.. మహిళల పరిస్థితిలో ఏ మార్పూ రాలేదని  ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here