రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికల మెనిఫెస్టోను బీజేపీ విడుదల చేసింది. రైతులు, యువతకు పెద్దపీట వేసింది. నిరుద్యోగ యువకులకు నెలకు 5 వేల భృతి అందజేస్తామని బీజేపీ హామీ ఇచ్చింది. ప్రతి జిల్లాలో యోగా భవన్‌ ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. గత ఐదేళ్లలో ఇచ్చిన హామీల్లో 95 శాతం హామీలు నెరవేర్చినట్లు బీజేపీ వెల్లడించింది.

రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండడంతో బీజేపీ మేనిఫెస్టో విడుదల చేసింది. ‘రాజస్థాన్‌ గౌరవ్‌ సంకల్ప్‌’ పేరిట కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ ఎన్నికల ప్రణాళికను విడుదల చేశారు.

బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే సాగునీటి కొరత తీరుస్తామని, ఇందుకోసం ప్రత్యేక పథకాలు తేనున్నట్లు హామీ ఇచ్చింది. రైతుల ఆదాయాన్ని ద్విగుణీకృతం చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తుందన్నారు. గ్రామీణ ఉపాధి, పట్టణ ఉపాధి గ్యారంటీ చట్టాన్ని తెస్తామని మేనిఫెస్టో పేర్కొంది. నిరుద్యోగ భృతి కింద నెలకు 5 వేలు ఇస్తామని తెలిపింది. ప్రతి ఏడాది 30 వేల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు మేనిఫెస్టో వెల్లడించింది.

గ్రామాలకు 250 కోట్లు స్టార్టప్‌ ఫండ్‌ ఏర్పాటు చేస్తామని బీజేపీ హామీ ఇచ్చింది. ప్రతి జిల్లాకు ఒక ‘యోగ భవన్‌’ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. అన్ని జిల్లాలకు జాతీయ రహదారులతో అనుసంధానం చేస్తామని మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది.

గత ఐదేళ్లలో తమ ప్రభుత్వం ఎన్నో అభివృద్ధి పనులు చేసిందని బీజేపీ తెలిపింది. గత 55 ఏళ్లలో జరగని పనులు ఈ ఐదేళ్లలో జరిగాయని చెప్పుకుంది.. గత ఎన్నికల మెనిఫెస్టోలో 665 హామీలు ఇవ్వగా అందులో 630 హామీలను నెరవేర్చినట్లు ముఖ్యమంత్రి వసుంధరా రాజే చెప్పారు. 2 లక్షల 25 వేల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేశామని… 15 లక్షల మంది యువతకు ఉపాధి చూపినట్లు తెలిపారు. 30 లక్షల మంది రైతులకు 50 వేల రూపాయల రుణమాఫీతో పాటు రైతుల బీమాను 50 వేల నుంచి పది లక్షలకు పెంచడం జరిగిందన్నారు.

విద్యారంగంలో రాజస్థాన్‌ దేశంలోనే ద్వితీయ స్థానంలో నిలిచిందని బీజేపీ తెలిపింది. గత ఐదేళ్లలో 13 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ స్కూళ్లలో చేరారు. 7 మెడికల్‌ కాలేజీలు, రెండు నైపుణ్య వికాస విశ్వవిద్యాలయాలు నెలకొల్పాం. 1100 ఐఐటీలు తెరిచాం. భామాశాహ పథకం ద్వారా కోట్లాది మందికి ప్రజలకు ఆరోగ్య సేవలు లభించాయని బీజేపీ పేర్కొంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here