• డబ్బుల కోసమే పోలవరం ప్రాజెక్టు…
  • జగన్ పై దాడి వెనుక ప్రభుత్వ పెద్దల హస్తం…
  • దెందులూరులో వైసీపీ నేత వైవీ సుబ్బారెడ్డి…

రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతోందని వైసీపీ నేత మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ధ్వజమెత్తారు. పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పాలనే ఇందుకు సాక్ష్యమని ఆయన అన్నారు. దెందులూరులోని పార్టీ కార్యాలయాన్ని సందర్శించిన ఆయన మీడియాతో మాట్లాడారు. వైసీపీ నేతలు ఆళ్ల నాని, కొఠారు అబ్బయ్య చౌదరి,కోటగిరి శ్రీధర్‌, కారుమూరి నాగేశ్వర రావు, కమ్మ శివరామకృష్ణలు పార్టీ కార్యాలయానికి సుబ్బారెడ్డితో పాటు చేరుకున్నారు.

కేంద్ర ప్రభుత్వం నిర్మించాల్సిన పోలవరం ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు చేపడుతుందని ఆయన ప్రశ్నించారు. తీరా ఇప్పుడేమో నిధులు లేవన్న కారణం చూపించి ప్రాజెక్టును అటకెక్కించే ప్రయత్నం చేస్తుందంటూ విమర్శించారు. రాష్ట్ర్ర ప్రభుత్వ పధకాలన్నీ కేవలం పచ్చ చొక్కాల కోసమేనని ఆయన ఆరోపించారు. ప్రతి సోమవారం చంద్రబాబు పోలవరం ప్రాజెక్టును సందర్శిస్తున్నది కేవలం దోచుకున్న లెక్కల కోసమేనని ఆయన స్పష్టం చేశారు. కేవలం డబ్బుల కోసమే ప్రభుత్వం ఈ ప్రాజెక్టును నెత్తిన పెట్టుకుందని సుబ్బారెడ్డి మండిపడ్డారు. ప్రస్తుతం జరుగుతున్న పనులతీరు చూస్తుంటే వచ్చే ఏడాదికి కూడా ప్రాజెక్టు పూర్తయ్యేలా కన్పించడం లేదన్నారు. విశాఖ విమానాశ్రయంలో తమ పార్టీ నేత వైఎస్ జగన్ పై హత్యాయత్నం జరిగితే…ఆ సంఘటనను చిన్నదిగా చూపే ప్రయత్నం చేయడం దారుణమన్నారు. సిట్ కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్ట్ అనంతరం కూడా పోలీసుల తీరు మారలేదన్నారు. ఈ కేసు వెనుక ప్రభుత్వ పెద్దలు ఉన్నందునే…నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని వైవీ సుబ్బారెడ్డి ఆరోపించారు. కేసును స్వతంత్ర దర్యాప్తు సంస్థతో విచారణ చేయించాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రజలన్నీ
గమనిస్తున్నారని…రానున్న ఎన్నికల్లో టీడీపీకు బుద్ధి చెబుతారన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here