జగన్ కు ఇది పునర్జన్మే..నా కడుపు కొట్టొద్దు..
నిరంతరం అవమానాలు ఎదుర్కొంటునే ఉన్నాం…మీడియాతో వైఎస్ విజయమ్మ

విశాఖ విమానాశ్రయంలో జగన్ పై హత్యాయత్నం ఘటన అనంతరం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ ఇవాళ తొలిసారిగా మీడియా ముందుకు వచ్చారు. ఎల్లప్పుడూ ప్రజల కోసమే పాటుపడుతున్న తన కుమారుడు వైఎస్‌ జగన్‌ను ఎన్ని కుట్రలు పన్నినా… జనం నుంచి వేరు చేయలేరని ఆమె స్పష్టం చేశారు. విశాఖ విమానాశ్రయంలో అక్టోబర్ 25వ తేదీన జగన్‌పై హత్యాయత్నం అనంతరం వైద్యుల సలహా మేరకు విశ్రాంతి తీసుకున్న జగన్…రేపటి నుంచి తిరిగి ప్రజా సంకల్ప యాత్రను ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో వైఎస్‌ విజయమ్మ ఇవాళ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియా ముందు తన ఆవేదనను పంచుకున్నారు.రాష్ట్ర ప్రజలే జగన్ కు భరోసా ఇ‍వ్వాలని విజయమ్మ విజ్ఞప్తి చేశారు.

వైఎస్‌ జగన్‌ పాదయాత్రకు తిరిగి వెళ్తుండగా.. కృతజ్ఞతను, విన్నపాన్ని తెలపడానికి మీ ముందుకు వచ్చాను. రాష్ట్ర ప్రజానీకానికి ఎంతో రుణపడి ఉన్నాం. దివంగత నేత వైఎస్‌ రాజశేఖరరెడ్డిని, కార్యకర్తలకు, తమ కుటుంబాన్ని ప్రేమించే ప్రతి సన్నిహితుడికి హృదయ పూర్వక నమస్కారాలు తెలుపుతున్నాను. జగన్‌ కోలుకోవాలని, ప్రతి ఒక్కరు ప్రార్ధించారు.. ప్రేమించారు. వారందరికి మా కుటుంబం ఎంతో రుణపడి ఉంటుంది.

వైఎస్‌ జగన్‌కు ఇది పునర్జన్మ..

రాష్ట్ర ప్రజలు మహానేత వైఎస్ ను నాయకుడిగా గుర్తించి 30 ఏళ్లు ఆరాధించారని… ఆయన సీఎం అయిన తరువాత ప్రజలందరిని ఆదుకున్నారని…తన తండ్రి తనను ఎన్నడూ ఒంటరి చేయలేదని జగన్ అంటూ ఉంటాడని తల్లి విజయమ్మ గుర్తు చేసుకున్నారు. తన తండ్రి తనకు ఇంత పెద్ద కుటుంబాన్ని ఇచ్చారని చెబుతుండటం అందుకు నిదర్శనమని అన్నారామె. తన కుమారుడికి కచ్చితంగా ఇది పునర్జన్మేనని… గొంతులో దిగాల్సిన కత్తి అదృష్టవశాత్తు భుజానికి తగలడంతో… ప్రజల ప్రేమ, దీవెనలతో ప్రమాదం నుంచి బయటపడ్డారని ఆమె చెప్పారు. వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీ తొలి ప్లీనరిలోనే తన కొడుకును అప్పజెప్పుతున్నానని ప్రజలకు మాటిచ్చానని…అప్పటి నుంచి తను ప్రజల మధ్యనే ఉన్నాడని విజయమ్మ తెలిపారు. ప్రజా సమస్యలతో పాటు సమైక్యాంధ్ర ఉద్యమం, ప్రత్యేకహోదా విషయంలో అనేక పోరాటాలు, దీక్షలు చేసినా.. ఇడుపులపాయ నుంచి 11 జిల్లాల మీదుగా సుమారు 3200 కిలోమీటర్లు పాదయాత్ర చేసినా ప్రజల ఆశీర్వాదం వల్లే సాధ్యమైందన్నారు ఆమె.

ప్రజల మధ్యన ఉంటే సాధ్యం కాదని… హత్యాయత్నానికి ప్రజలు ఉండని ఎయిర్ పోర్ట్ ను ఎంచుకున్నారని.. సంస్కారం లేకుండా…తల్లి, భార్య, చెల్లెలిపై నిరాధారమైన ఆరోపణలు చేశారని…అయినా మౌనంగా సహిస్తున్నాం.. భరిస్తున్నామని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఏ పార్టీకైతే 30 ఏళ్లు సేవ చేశాడో ఆ పార్టీనే అతన్ని దోషిని చేసి.. ఇప్పటికి వేధిస్తుందని…ఆర్థికంగా ఇబ్బంది పెట్టాలన్న కారణంతో జగన్ పై అన్నిదాడులు చేయించి 16 నెలలు జైలులో పెట్టారని ఆమె గుర్తు చేశారు. తనకు తెలిసి దేశంలో మరే ఇతర నాయకుడు ఇన్ని వేధింపులు ఎదుర్కోలేదని… అయినా సరే…తన కొడుు దేనికి చలించలేదని…అదరలేదని గర్వంగా చెప్పారు. ఇన్ని సమస్యలున్నా…అన్నింటినీ పక్కనపెట్టి… ప్రజల మధ్యే ఉండి పోరాడుతున్నారన్నారు. తన కొడుకుపై హత్యాయత్నం జరిగి 17 రోజులవుతున్నా…. కేసులో పురోగతి లేకపోగా ఎక్కడేసిన గొంగళి అక్కడే ఉందన్నారు.

సీఎం, డీజీపీలపై మండిపడ్డారు…

వీఐపీ లాంజ్‌లోనే భద్రతా లేకుంటే ఎలా అని ఆమె ప్రశ్నించారు. చిన్న గుండు సూది కూడా తీసుకుపోనివ్వని ఎయిర్‌పోర్ట్‌లోకి ఏ విధంగా కత్తులు వెళ్లాయి? ఈ ఘటనకు ఎవరు సహకరించారనే దిశలో విచారణ ఎందుకు జరగడం లేదని ఆమె నిలదీశారు. దాడి జరిగిన గంటలోనే సీఎం, డీజీపీలు బాధ్యతారాహిత్యంగా అవహేళనగా మాట్లాడటంపై ఆమె మండిపడ్డారు. అలిపిరి ఘటనలో నాడు వైఎస్‌ఆర్‌.. చంద్రబాబును పరామర్శించలేదా… గాంధీజీ విగ్రహం వద్ద నిరసన తెలపలేదా? అని గుర్తు చేశారు. ఎవరైతే ఈ హత్యాయత్నం చేశారో వారికి ఇలాంటి ప్రయత్నాలు చేయవద్దని…ఇప్పటికే వైఎస్ఆర్‌ను పోగొట్టుకొని బాధలోఉన్నామని…ఇప్పుడు తన కొడుకును కూడా తీసుకెళ్లి తన కడుపుకొట్టొద్దంటూ విజయమ్మ చేతులెత్తి నమస్కరిస్తూ…భావోద్వేగానికి గురయ్యారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here