అందరి చూపూ ఆ సభపైనే..
జగన్ ఏం మాట్లాడతారన్న ఆసక్తి…
నేడు పార్వతీపురంలో బహిరంగసభ…

వైఎస్ జగన్ పై విశాఖ విమానాశ్రయంలో దాడి అనంతరం ప్రజా సంకల్పయాత్ర ప్రారంభమైనా… ఇప్పటివరకూ ఎక్కడా జగన్ మాట్లాడలేదు. ఎక్కడా బహిరంగసభ జరగలేదు. మీడియాతో కూడా మాట్లాడని పరిస్థితి. ఇప్పుడందుకే సర్వత్రా ఆసక్తి నెలకొంది.నేడు జరిగే పార్వతీపురం సభపైనే అందరి దృష్టీ నెలకొంది.

వైఎస్ జగన్ ప్రజా సంకల్పయాత్ర ప్రారంభమైనప్పటి నుంచి ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై విరుచుకపడుతూనే జగన్ ప్రసంగం సాగింది.ఇప్పటికి ప్రజా సంకల్పయాత్రలో చాలా బహిరంగసభలు జరిగాయి. కానీ నేడు జరగనున్న పార్వతీపురం సభ అన్నింటికీ ప్రత్యేకం.మిగిలిన సభలకూ…ఈ సభకూ వ్యత్యాసం సుస్పష్టం. అక్టోబర్ 25న హత్యాయత్నం ఘటన అనంతరం ఇప్పటివరకూ జగన్ ఎక్కడా నోరు విప్పలేదు. విశ్రాంతి అనంతరం పాదయాత్ర ప్రారంభించి నాలుగురోజులవుతున్నాసరే…ఎక్కడా ఏ వ్యాఖ్యలూ చేయలేదు. అందుకే పార్వతీపురంలో నేడు జరిగే బహిరంగసభకు అంతటి ప్రాధాన్యత వచ్చింది. ఈ సభలో ఏం మాట్లాడతారో అన్న ఆసక్తి సర్వత్రా నెలకొందిప్పుడు. ఎవరిని నేరుగా టార్గెట్ చేస్తారా అన్నది సందిగ్దం. హత్యాయత్నం ఘటన అనంతరం ప్రజల సమక్షంలో జరిగే తొలి బహిరంగసభ. ఏ నిర్ణయం తీసుకుంటారో అన్నది ప్రతి ఒక్కరిలో ఉన్న ఆతృత. విజయనగరం జిల్లాలో సెప్టెంబర్‌ 24 నుంచి జగన్ పాదయాత్ర సాగుతోంది. జిల్లాలో అడుగుపెట్టినప్పటి నుంచే కుట్రలు ప్రారంభమయ్యాయన్న
సంకేతాలు స్పష్టంగా ఉన్నట్టు తెలుస్తోంది. సభలకు తరలివస్తున్న అశేష జనాన్ని చూసి ప్రత్యర్ధుల్లో కలవరం మొదలైంది.యాత్రకు అడ్డంకులు సృష్టించేందుకు ప్రయత్నించారు. చివరికి జిల్లాలో పాదయాత్ర ప్రారంభమైన నెల రోజులకు విశాఖ ఎయిర్ పోర్ట్ లో హత్యాయత్నానికే ఒడిగట్టేశారు. అదృష్టవశాత్తూ బతికి బయటపడి…తిరిగి ప్రజల సమక్షంలో పాదయాత్ర సాగిస్తున్నారు.

ఇవాళ జరగనున్నఈ బహిరంగ సభపై అందరికీ ఆసక్తి పెరగడానికి కారణమిదే. దాడి గురించి ప్రజల సమక్షలో ఏం మాట్లాడతారో అని ఎదురుచూస్తున్నారు. ఆసలు ఆ రోజు ఏం జరిగింది…ఎలా జరిగింది..ఎవరెవరున్నారు…ఈ వివరాలన్నీ పోలీసుల దర్యాప్తులోనూ..వైసీపీ నేతల మాటల్లోనూ విన్నదే కానీ జగన్ నోటి నుంచి స్వయంగా వినలేదు ఎవ్వరూ. ఈ నేపధ్యమే సభకు ప్రాధాన్యత పెరగడానికి కారణమైంది.

నేటి పాదయాత్ర ఇలా…

విజయనగరం జిల్లాలో నేటి పాదయాత్ర సీతానగరం మండలం సూరంపేట నుంచి ప్రారంభం కానుంది. అక్కడి నుంచి పార్వతీపురం పాత బస్టాండ్ జంక్షన్ వరకూ ప్రజా సంకల్ప యాత్ర జరగనుంది. సూరంపేట నుంచి నర్శీపురం, వసుంధర నగర్, యర్రా కృష్ణమూర్తి కాలనీల మీదుగా బస్టాండ్ జంక్షన్ కు చేరుకుంటారు. ఇదే ప్రాంతంలో సాయంత్రం ఏర్పాటుచేసిన బహిరంగసభలో జగన్ ప్రసంగించనున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here