• సవాళ్లు, ప్రతి సవాళ్లతో హోరెత్తిస్తున్న నేతలు
• కొడంగల్‌లో కేటీఆర్ రోడ్‌ షోలు
• పాలమూరు ఎత్తిపోతల పథకంతో కొడంగల్‌కు సాగునీరు

అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని మంత్రి కేటీఆర్‌ అన్నారు. కేసీఆర్‌ మరోసారి ముఖ్యమంత్రి అయితే.. రాజకీయ సన్యాసం తీసుకుంటారా.. అంటూ రేవంత్‌రెడ్డికి సవాల్‌ విసిరారు. టీఆర్ఎస్ అభ్యర్ధి నరేందర్ రెడ్డి తరపున ప్రచారం చేసిన కేటీఆర్.. ఆయన్ను గెలిపిస్తే.. సిరిసిల్ల తరహాలో కొండగల్‌ను అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు.

ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ.. తెలంగాణలో ప్రచార పర్వం ఆసక్తి కరంగా మారుతుంది. ఇప్పటి వరకు విమర్శలకు పరిమితమైన నేతలు.. ఇక సవాళ్లు.. ప్రతిసవాళ్లకు సిద్ధమయ్యారు. కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి ఇలాఖా కొడంగల్ నియోజకవర్గంలో మంత్రి కేటీఆర్ రోడ్‌షో నిర్వహించారు. పాలమూరు ఎత్తిపోతల పథకంతో కొడంగల్‌కు సాగునీరు అందిస్తున్నట్లు కేటీఆర్ చెప్పారు.రేవంత్‌రెడ్డి టీవీల్లో ఫోజులు ఇవ్వడం తప్ప నియోజకవర్గానికి చేసింది శూన్యమని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌ హయాంలో రూ. 2వేలు పెన్షన్‌ ఎందుకు ఇవ్వలేదన్న కేటీఆర్..నరేందర్‌రెడ్డిని గెలిపిస్తే లక్షా 20వేల ఎకరాలకు సాగునీరు అందిస్తామని హామీ ఇచ్చారు.టీఆర్‌ఎస్‌ అభ్యర్ధిని గెలిపిస్తే.. తాను కొడంగల్‌ను దత్తత తీసుకుంటానన్నారు. సిరిసిల్ల తరహాలో కొడంగల్‌ను అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. పరిపాలన అంటే ఏంటో ఈ నాలుగేళ్లలో చేసి చూపించామన్న కేటీఆర్… సంక్షేమ పథకాలకు వేల కోట్లు ఖర్చు చేసినట్లు చెప్పారు. పేదల జీవితాల్లో వెలుగులు నింపుతున్నామన్నారు. తెలంగాణ వస్తే చీకట్లు వస్తాయని అపోహలు సృష్టించారన్నారు కేటీఆర్.

కొడంగల్‌ రోడ్‌ షోలో రేవంత్‌రెడ్డికి కేటీఆర్‌ సవాల్‌ విసిరారు. టీఆర్‌ఎస్‌ అధికారంలోకి రాకుంటే రాజకీయ సన్యాసానికి తాను సిద్ధమన్నారు. కాంగ్రెస్‌ అధికారంలోకి రాకుంటే రాజకీయ సన్యాసానికి రేవంత్‌ సిద్ధమా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్‌లో జిల్లాకు నలుగురు చొప్పున సీఎం అభ్యర్థులున్నారని కేటీఆర్ ఎద్దేవా చేశారు. ఢిల్లీ, అమరావతి బానిసలు మనకు అవసరమా? సీల్డ్ కవర్ సీఎం కావాలా.. సింహం లాంటి కేసీఆర్ కావాలా? కరెంటు అడిగితే కాల్చి చంపిన కాంగ్రెస్ వైపు ఉందామా? అడగకుండానే 24 గంటలు కరెంటు ఇచ్చిన టీఆర్‌ఎస్ వైపు ఉందామా? సంక్షోభం వైపు ఉందామా? సంక్షేమం వైపు ఉందామా? కొడంగల్‌కు నీళ్లు కావాలా? కన్నీళ్లు కావాలా? అని మత్రి కేటీఆర్ కొడంగల్ ప్రజలను ప్రశ్నించారు.
డిసెంబర్ 11 తర్వాత పెన్షన్లన్నీ రెట్టింపు అవుతాయని కేటీఆర్ చెప్పారు. పెన్షన్ల వయోపరిమితి 58 ఏళ్లకు తగ్గిస్తామన్న ఆయన.. సంక్షేమ హాస్టళ్లలో సన్నబియ్యంతో అన్నం పెడుతున్నామన్నారు. 17 వేల కోట్ల రుణమాఫీ చేసిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందన్న కేటీఆర్.. రైతుల కోసం మరింత చేయాలన్నదే సీఎం తపన అని చెప్పారు. కాంగ్రెస్‌ దొంగల పార్టీ అని, మహాకూటమిని చిత్తుగా ఓడించాలని కోరారు. అభివృద్ది కావాలంటే కేసీఆర్‌ ప్రభుత్వం మళ్లీ రావాలన్నారు కేటీఆర్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here